భారత్‌ను పాకిస్థాన్ పెద్దముప్పుగా భావించడం లేదని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పునరుద్ధాటించారు. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో ఆ దేశ సైన్యం తాలిబాన్ తీవ్రవాదులతో గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో పోరాడుతున్న సంగతి తెలిసిందే. తాలిబాన్ తీవ్రవాదులే తమ దేశానికి భారత్ కంటే పెద్ద ముప్పు అని గతంలో జర్దారీ ఉద్ఘాటించారు.
తాజాగా ఆయన మాట్లాడుతూ.. భారత్ నుంచి పాకిస్థాన్‌కు పెద్దముప్పు పొంచివుందని తాము భావించడం లేదన్నారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య మరో యుద్ధం జరిగే అవకాశాలు కూడా అసలు లేవన్నారు. ఇరుదేశాలు అణ్వాయుధాల సమకూర్చుకున్న కారణంగా ఒక దేశం మరో దేశాన్ని ఆక్రమించుకునే సాహసం చేయబోవన్నారు.
ఇటీవల కాలంలో భారత్‌వైపు సున్నితవైఖరి, అనుకూల వ్యాఖ్యలు చేస్తుండటం, దేశంలో తీవ్రవాదాన్ని అణిచివేస్తామని ప్రచారం చేస్తుండటంపై స్వదేశంలో జర్దారీని విమర్శిస్తున్నవారు కూడా లేకపోలేదు. అయితే తనపై దీనికి సంబంధించి వస్తున్న విమర్శలను జర్దారీ తోసిపుచ్చారు. ఇటువంటి విమర్శలు ఇరుకు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులకే ఆగ్రహం తెప్పిస్తాయన్నారు.
పాకిస్థాన్ ఆర్మీ కూడా ఈ విమర్శలపై ఆగ్రహం చెందబోదన్నారు. ఎందుకంటే పాకిస్థాన్, భారత్‌లు అణ్వాయుధ దేశాలు. అందువలన ఇరుదేశాలు ఒకదానిపై ఒకటి దాడి చేసుకునేందుకు సాహసించబోవని ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్దారీ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో శక్తివంతమైన పాకిస్థాన్ మిలిటరీ కూడా అధ్యక్షుడు భారత్ విషయంలో వెలిబుచ్చుతున్న అభిప్రాయాలకు మద్దతు ఇస్తోంది.