భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించేందుకు అమెరికా ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లు తేవడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ శనివారం స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలోని అధికారిక యంత్రాంగం భారత్ లేదా పాకిస్థాన్ ప్రభుత్వాలపై ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించే దిశగా ఎటువంటి ఒత్తిడి తేవడం లేదన్నారు.
గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల తరువాత భారత్- పాక్ ద్వైపాక్షిక చర్చలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శిగా హిల్లరీ క్లింటన్ తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఐదు రోజుల పర్యటనపై శుక్రవారం రాత్రి ఆమె ముంబయి చేరుకున్నారు.
ఈ రోజు ఉదయం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన హిల్లరీ క్లింటన్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ద్వైపాక్షిక చర్చలకు తమ దేశం మద్దతు మాత్రమే ఇస్తుందని, అయితే ఇందులో జోక్యం చేసుకోలేదని తెలిపారు.
తీవ్రవాదంపై చర్యల విషయంలో మాత్రం తాము పూర్తి మద్దతు అందిస్తున్నామని చెప్పారు. అయితే ద్వైపాక్షిక చర్చల విషయంలో తామెటువుంటి ఒత్తిళ్లు తేవడం లేదన్నారు. రెండు సార్వభౌమదేశాలు ద్వైపాక్షిక చర్చల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.