భారత సరిహద్దుల్లోని తమ సైన్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులవైపు పంపే ఆలోచనలేవీ లేవని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం గత కొన్ని నెలలుగా తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఈ యుద్ధానికి మద్దతుగా భారత్‌తో ఉన్న సరిహద్దు వెంబడి కొంత సైన్యాన్ని ఆవలివైపు తరలించే ప్రతిపాదనలను పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోందని గత కొంతకాలంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ దేశ తూర్పు సరిహద్దుల (భారత్‌వైపు) నుంచి పశ్చిమ సరిహద్దులకు సైన్యాన్ని తరలించే ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని స్పష్టం చేశారు.
భారత సరిహద్దు వెంబడి సైన్యాన్ని పాకిస్థాన్ తగ్గించబోదన్నారు. పాకిస్థాన్ సాంప్రదాయ ముప్పును తేలిగ్గా తీసుకోబోదని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఖమర్ జమాన్ కైరా తెలిపారు. అంతర్జాతీయ అభ్యంతరాలను భారత్ పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌కు తమ దేశం ఎటువంటి సమస్యలు సృష్టించబోదని ఉద్ఘాటించారు.
ఐఎస్పీఆర్ ప్రతినిధి మేజర్ జనరల్ అతార్ అబ్బాస్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో కైరా మాట్లాడుతూ.. కాశ్మీర్ వివాదంతోపాటు, భారత్‌తో ఉన్న దీర్ఘకాల సమస్యలను పరిష్కరించుకునేందుకు పాకిస్థాన్ కట్టుబడి ఉందని, ఇందుకోసం అతృతగా ఎదురుచూస్తోందని తెలిపారు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం ఆగిపోయిన ఇరుదేశాల శాంతి ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆకాంక్షించారు.