తమ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను భారత్ ప్రోత్సహిస్తుందనేందుకు సంబంధించిన సాక్ష్యాధారాల నివేదికను పాక్ యంత్రాంగం భారత్‌కు అందజేసిందని ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే ఆ వార్తలను భారత్ తోసిపుచ్చింది.
ఈజిప్టులో ఇటీవల జరిగిన అలీనోద్యమ దేశాల సమావేశంలో భాగంగా ఇరుదేశాల ప్రధానమంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బెలూచిస్థాన్‌లో భారత్ తీవ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహింస్తుదనే ఆరోపణలను బలపరిచే సాక్ష్యాధారాల నివేదికను పాకిస్థాన్ ప్రభుత్వం భారత అధికారిక బృందానికి అందజేసినట్లు డాన్ అనే పత్రిక వెల్లడించింది.
ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ బృందానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఎటువంటి సాక్ష్యాధారాల నివేదిక అందజేయలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకే పాక్ మీడియాలో ఇటువంటి వార్తలు వచ్చాయని భారత యంత్రాంగం ఆరోపించింది.
బెలూచిస్థాన్‌లో అశాంతితో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని, అదేవిధంగా లాహోర్‌లో శ్రీలంక జట్టుపై జరిగిన దాడిలోనూ తమ పాత్ర లేదని న్యూఢిల్లీ అధికారిక యంత్రాంగం చెప్పినట్లుగా గురువారం మీడియాలో వార్తలు వచ్చాయి. తీవ్రవాద నిరోధక వ్యవస్థలో భాగంగా పాకిస్థాన్‌లోని సమస్యాత్మక బెలూచిస్థాన్‌పై భారత్ చర్చలు జరిపిందని భారత్ అధికారులు వెల్లడించారు.
ఇరుదేశాల ప్రధానమంత్రుల మధ్య ఈజిప్టులో దీనిపై చర్చలు జరిగినమాట నజమేనని తెలిపారు. అయితే పాకిస్థాన్ ఈ సందర్భంగా తమ దేశంలో జరిగిన తీవ్రవాద దాడుల్లో భారత్ ప్రమేయం ఉందనే వాదనను బలపరిచే ఆధారాలేవీ అందజేయలేదన్నారు.