ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శుక్రవారం వేర్పేరు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 29 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఐదు షియా మసీదుల సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయని ఇరాక్ పోలీసులు తెలిపారు.
శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన భక్తులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని ఇరాక్ పోలీసులు వెల్లడించారు. గత కొంతకాలంగా ఇరాక్ రాజధానిలో ప్రశాంత వాతావరణం నెలకొనడంలో పౌరులు ఇప్పుడిప్పుడే బాంబు పేలుళ్ల భీభత్సాల నుంచి కోలుకుంటున్నారు. అయితే తాజా బాంబు పేలుళ్లు మళ్లీ గత స్మృతులను గుర్తు చేశాయి.
ఇదిలా ఉంటే అమెరికా సేనల నుంచి ఇరాక్ నగరాల శాంతి, భద్రతల బాధ్యతలు చేపట్టిన స్వదేశీ భద్రతా సిబ్బంది సామర్థ్యంపై కూడా అనుమానులు తలెత్తుతున్నాయి.
ఇరాక్ నగరాల సంరక్షణ బాధ్యతలను అమెరికా సేనలు స్వదేశీయులకు అప్పగించినప్పటి నుంచి వివిధ నగరాల్లో తరుచుగా బాంబు పేలుళ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా సేనలు ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని గౌరవిస్తూ ఇరాక్ నగరాల వెలుపల స్థావరాలకు పరిమితమై ఇతర విధులు నిర్వర్తిస్తున్నాయి.