ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని సున్నీతెగకు చెందిన అతిపెద్ద మసీదు లోపల ఆదివారం రాత్రి ప్రార్ధనలు జరుపుతున్న సమయంలో ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు జరిపిన బాంబు దాడిలో 29 మంది మరణించారు. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఇదే విధమైన దాడి ఇరాక్‌లో పౌర యుద్ధానికి కారణమైంది. సున్నీ తెగకు చెందిన పార్లమెంట్ విధారకర్త ఖలీద్ అల్ ఫాహ్దావీ కూడా మృతుల్లో ఉన్నట్లు ఇరాక్ భద్రతా దళాలు వెల్లడించాయి.
పశ్చిమ బాగ్దాద్‌లోని ఉమ్ అల్ క్వరా మసీదులో ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు సంభవించినట్లు బాగ్దాద్ సైనిక కార్యకలాపాల కమాండ్ ప్రతినిధి మేజర్ జనరల్ ఖాసిం అల్ మౌసావీ ధృవీకరించారు. ఈ మసీద్ బాగ్దాద్‌లో అతిపెద్ద సున్నీతెగ మసీదు. సున్నీ తెగకే చెందిన ఇరాక్ నియంత సద్ధాం హుస్సేన్‌ను ఉరితీసిన అనంతరం ఇరాక్‌లో బాంబు దాడులు, తెగల మధ్య ఘర్షణలు పెచ్చరిల్లాయి.
అమెరికా బలగాలు ఇరాక్‌లో మరికొన్ని వారాలు కొనసాగేది లేనిది ఇంకా తెలియరాలేదు. అమెరికా ఇప్పటికే తన బలగాల ఉపసంహరణ ప్రారంభించింది. సుమారు 46 వేల అమెరికా బలగాలు ఇరాక్‌లో ఉన్నాయి. కాగా పదివేల బలగాలను ఇరాక్‌లోనే ఉంచటానికి వైట్‌హౌస్ ముందుకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇరాక్ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన హింస ఇటీవల కాలంలో ప్రతిరోజు చోటుచేసుకుంటూనే ఉంది.