పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ అరబ్ ప్రపంచంలో పరిస్థితిని చర్చించేందుకు గానూ బుధవారం బహ్రైయిన్ పర్యటనకు వెళ్లారు. జర్దారీ బహ్రైయిన్‌లో కొన్ని గంటలు మాత్రమే ఉంటారని చెప్పిన అధ్యక్షుడి ప్రతినిధి ఫర్హతుల్లాహ్ బాబర్ ఇతర వివరాలు అందించడానికి నిరాకరించారు.
జర్దారీ బహ్రైయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడి వెంట మంత్రులు, సీనియర్ అధికారుల బృందం కూడా వెళ్లింది. బహ్రైయిన్ విదేశాంగ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా ఏప్రిల్‌లో ఇస్లామాబాద్‌లో పర్యటించి తమ దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన కారణంగా ఏర్పడ్డ సంక్షోభాన్ని పరిష్కరించడంలో పాకిస్థాన్ సహాయాన్ని కోరారు.