భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. సోమవారం రాత్రి ఆయన ఫ్రాన్స్‌లో అడుగుపెట్టారు. ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఇరుదేశాలు అణు శక్తి, రక్షణ, వాణిజ్య, ఇతర కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తాయి.
ఐదు రోజుల రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని భారత అధికార బృందం ఫ్రాన్స్ రాజధానిలో అడుగుపెట్టింది. ఫ్రాన్స్ పర్యటన అనంతరం మన్మోహన్ సింగ్ ఈజిఫ్టు వెళ్లనున్నారు. అక్కడ జరిగే 15వ అలీనోద్యమ దేశాల సమావేశంలో ప్రధాని పాల్గొంటారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ ఆహ్వానంపై ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి పారిస్ వెళ్లారు. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
వాణిజ్యం, పెట్టుబడులు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష, అణు శక్తి, రక్షణ, విద్య, సాంస్కృతిక, పర్యాటక, ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఫ్రాన్స్‌తో భాగస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు ఈ పర్యటనలో ప్రయత్నిస్తామని పారిస్ బయలుదేరి వెళుతున్న సందర్భంగా మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో విలేకరులతో చెప్పారు.