ఫెషావర్‌లోని పెరల్ కాంటినెంటల్ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి కారణంగా ఆ ప్రాంతానికి విమానాలు నడపబోమని పాకిస్థాన్ ఫైలెట్లు భీష్మించుకున్నారు. ఈ హోటల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో తమ సహచర ఉద్యోగిని కోల్పోయిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ అంతర్జాతీయ విమాన సర్వీసుల సంస్థ (పీఐఏ) ఉద్యోగులు తేల్చి చెప్పారు.
ఈ విషయమై ఫైలట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సొహయిల్ బాలోక్ మాట్లాడుతూ పెరల్ కాంటినెంటల్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి సందర్భంగా తమ కో ఫైలెట్ యూసఫ్ మృతి చెందినట్టు తెలిపారు. ఫెషావర్‌లో ఫైలెట్ల రక్షణకు సంబంధించి ఇదివరకే యాజమాన్యానికి లేఖ రాశామని, ఫెషావర్- ఇస్లామాబాద్ మధ్య ప్రయాణ సమయంలో తమకు ఇస్లామాబాద్‌లోనే వసతి కల్పించాలని కోరామని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ విషయంలో యాజమాన్యం చొరవ చూపించని కారణంగానే ఫెషావర్‌లో బస చేసిన తమ సహచరుడు మరణించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫైలట్లు తీసుకున్న ఈ నిర్ణయంతో ఫెషావర్‌కు పీఐఏ నడిపే సర్వీసులు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే తమ విన్నపాన్ని మన్నించేంతవరకు తమ నిర్ణయం మార్చుకోబోమని ఫైలట్లు స్పష్టం చేయడం గమనార్హం.