దివంగత ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇటీవల ముగిసిన యుద్ధంలో తన తరువాతి వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు భారత్‌లో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూసినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో 30 ఏళ్లపాటు సాగిన అంతర్యుద్ధానికి ఇటీవల ప్రభాకరన్ మరణంతో తెరపడిన సంగతి తెలిసిందే.
ఈ యుద్ధం చివరి రోజుల్లో శ్రీలంక సైన్యంచే అతితక్కువ ప్రాంతానికి పరిమితమైన ఎల్టీటీఈ బలగాలకు తదుపరి వ్యూహాన్ని తయారు చేసి ఇచ్చేందుకు ప్రభాకరన్ భారత్‌లో ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూశారని, ఆయన భారత్‌లో ఎన్డీఏ లేదా తృతీయ కూటమి అధికారంలోకి వస్తుందని భావించినట్లు సమాచారం. అయితే శ్రీలంక ఆర్మీ వద్ద అప్పటికే భిన్నమైన ప్రణాళికలు ఉన్నాయి.
తన, తన నేతృత్వంలోని ఎల్టీటీఈ భవితవ్యాన్ని నిర్ణయించుకునేందుకు భారత్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన మే- 16 వరకు ప్రభాకరన్ ఎదురుచూశారు. అయితే అప్పటికే శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో పరిస్థితులు ఎల్టీటీఈ చేయిదాటాయి.
శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ బలగాలను అన్నివైపుల నుంచి దిగ్బంధించింది. వారు తప్పించుకునే మార్గాలు లేకుండా చేసింది. మే- 16 తరువాత భారత్ నుంచి ఎవరో ఒకరు జోక్యం చేసుకొని శ్రీలంక సైన్యాన్ని అడ్డుకుంటారని, తాము తలదాచుకున్న చివరి కాల్పుల రహిత మండలంలోకి సైన్యాన్ని అడుగుపెట్టకుండా చూస్తారని ప్రభాకరన్ భావించినట్లు శ్రీలంక ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.