నేపాల్ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్ ఓటింగ్ ద్వారా నూతన ప్రధానమంత్రి ఎంపికకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించాలని ఆ దేశ పార్లమెంట్‌ను ఆదేశించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రధాన పార్టీల మధ్య అంగీకారం కుదరకపోవడంతో యాదవ్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. మధ్యంతర రాజ్యాంగానికి అనుగుణంగా యాదవ్ పార్లమెంట్ కార్యదర్శికి లేఖ రాశారు.
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పార్టీలకు తొలుత ఆదివారం వరకు గడువిచ్చిన అధ్యక్షుడు గడువును మరో మూడు రోజులు పెంచారు. బుధవారం మధ్యాహ్నంతో పెంచిన గడువు ముగిసినప్పటికీ పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. నేపాల్ ప్రధానమంత్రి ఝలానాధ్ ఖానల్ ప్రతిపక్ష పార్టీలు, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ- యూనిఫైడ్ మార్కిస్ట్ లెనిస్ట్ పార్టీలోని కొంత మంది నాయకుల ఒత్తిడి మేరకు ఆగస్ట్ 14న తన పదవికి రాజీనామా చేశారు. ఖానల్ 2011 ఫిబ్రవరి 3న ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.