పొరుగు దేశాలపై దాడులకు పాకిస్థాన్ భూభాగం ఉపయోగపడకుండా ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అమెరికా సెనెట్ దక్షిణాసియా విభాగ మాజీ సలహాదారు లిసా కర్టిస్ కోరారు. ఇతర దేశాలపై దాడులకు పాక్ గడ్డపై తీవ్రవాదులు తెగబడకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
పాకిస్థాన్ భూభాగంలో తీవ్రవాద మూకలకు కళ్లెం వేసేందుకు ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలపైనే దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత ఆధారపడి ఉన్నాయని చెప్పారు. అమెరికా కాంగ్రెస్ కమిటీని ఉద్దేశించి కర్టిస్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత భవిష్యత్, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులపై జరుపుతున్న యుద్ధ ఫలితం పాకిస్థాన్ ప్రభుత్వం వారి దేశంలో తీవ్రవాదంపై పోరుకు చూపే చొరవపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.
భారత్- పాకిస్థాన్ మధ్య శాంతి ప్రక్రియకు ఆమె మద్దతు పలికారు. దశాబ్దాల కాశ్మీర్ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు ఇరుదేశాలు శాంతి ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాసియా ప్రాంతంలో తీవ్రవాదంపై జరుపుతున్న పోరులో విజయం అమెరికా- పాకిస్థాన్ మధ్య పరస్పర సహకారంపైనే ఎక్కువగా ఆధారపడి ఉందన్నారు.