పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో పౌరుల పరిస్థితి చాలా బాధాకరంగా మారిందని అమెరికా ప్రకటించింది. అక్కడ సైనికులు, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య జరిగిన పోరాటంలో అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ ఉన్నవారి పరిస్థితి కడు దయనీయంగా మారిందని అమెరికా ఆవేదన చెందుతోంది.
పాక్‌లోని పౌరుల పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యంగా స్వాత్ లోయలోని ప్రజల స్థితిగతులను పర్యవేక్షించేందుకు, పాక్ శరణార్థుల శిబిరాన్ని సందర్శించేందుకుగాను అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా దూత రిచర్డ్ హాల్బ్రూక్ను పంపనునున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రాబర్ట్ వుడ్ తెలిపారు.
ఈ సందర్భంగా వుడ్ విలేకరులతో మాట్లాడుతూ... పాకిస్థాన్ అతి క్లిష్టమైన దశలో ఉందని, పాక్ సైన్యం తాలిబన్లతో జరుపుతున్న పోరులో న్యాయం ఉందని ఆయన అన్నారు. తన శక్తి సామర్థ్యాలకన్నాకుడా ఎక్కువగానే అక్కడి పౌరులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఉండేందుకు తగిన ప్రణాళికలను రూపొందించిందని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా పాకిస్థాన్‌లోని శరణార్థులను మానవతా దృక్పథంతో ఆదుకొనేందుకు అమెరికా 16 కోట్ల 80 లక్షల డాలర్లను సహాయంగా అందించింది. కాగా అమెరికా ప్రజలు స్వతహాగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ తదితర సాధనాల ద్వారా ఒక లక్ష ముఫై వేల డాలర్లకన్నాకూడా ఎక్కువగానే సహాయం అందించారని ఆయన పేర్కొన్నారు.