గత ఏడాది నవంబరులో ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడి కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థాన్ ప్రభుత్వంపై అమెరికా మరోసారి ఒత్తిడి తీసుకొచ్చింది. ఉగ్రవాద శక్తులపై తమ పరిధిలో దూకుడైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం నమ్మకం కలిగించాలని అమెరికా డిమాండ్ చేసింది.
ముంబయి దాడుల కుట్రదారులను చట్టం ముందుకు తీసుకురావాల్సిన ఆవశ్యకతను పాకిస్థాన్‌కు గుర్తు చేయడం కొనసాగిస్తామని అమెరికా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి ఫిలిప్ జే క్రోవ్లే బుధవారం విలేకరులతో చెప్పారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దాడుల కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు దర్యాప్తు కొనసాగిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ దాడుల కుట్రదారుగా భావిస్తున్న జాముదాత్ దవా తీవ్రవాద సంస్థ హఫీజ్ సయీద్‌ను లాహోర్ హైకోర్టు ఇటీవల గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంపై క్రోవ్లే మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై తమకు గౌరవం ఉందని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద శక్తులపై వారి పరిధిలో చర్యలు తీసుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.