పాకిస్థాన్ అణు పరిశోధనా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని తాలిబాన్ తీవ్రవాదులు తొలిసారి ఆత్మాహుతి దాడి చేశారు. రావల్పిండిలో జులై 2న దాడి జరిగిన బస్సులో అణుయేతర మిలిటరీ ప్లాంటులో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారని పాకిస్థాన్ అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ దాడికి మాత్రం తాలిబాన్లు అణు కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని వ్యూహరచన చేశారని చెప్పారు.
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రావీన్స్‌లో అనేక ప్రాంతాల్లో ఆ దేశ సైన్యం తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. వాయువ్య ప్రాంతంలో గత కొన్ని వారాలుగా పాకిస్థాన్ సైన్యం తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకార చర్యగా తాలిబాన్లు వివిధ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు.
ఇప్పటికే పాకిస్థాన్ అణ్వాయుధాలు తీవ్రవాదుల చేతుల్లోకి వెళతాయని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటువంటి సమయంలో అణు కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం ద్వారా తాలిబాన్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనుకున్నారని మిలిటరీ అధికారులు తెలిపారు.
గతంలో కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ అణ్వాయుధాలను తాము హస్తగతం చేసుకుంటామని తాలిబాన్, అల్ ఖైదా తీవ్రవాద సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమ లక్ష్యం పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చివేసి, అణ్వాయుధాలను సొంతం చేసుకోవడమేనని ఈ తీవ్రవాద సంస్థలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే పాక్ ప్రభుత్వం మాత్రం తీవ్రవాద సంస్థల చేతుల్లోకి తమ అణ్వాయుధాలు వెళ్లే ప్రసక్తే లేదని, అవి చాలా సురక్షితంగా ఉన్నాయని చెబుతోంది. పాక్ వాదనను అమెరికా కూడా సమర్థిస్తుండటం గమనార్హం.