పాకిస్థాన్‌లో మరో సైనిక తిరుగుబాటుకు కుట్ర జరుగుతున్నట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒకటి పేర్కొంది. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న "హిజ్బుత్ తహ్రిర్" అనే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పాక్‌లో సైనిక తిరుగుబాటు వచ్చేలా చేసి, అక్కడ ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు 'ది సండే టైమ్స్' పత్రిక వెల్లడించింది.
ఈ సంస్థ బ్రిటన్‌ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ షరియా పాలన నెలకొల్పాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తోంది. బోధనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ పాలన ఏర్పాటు చేస్తామని, ముస్లిమేతర దేశాలు అందుకు అంగీకరించక పోతే ఆయా దేశాలపై యుద్ధం చేసి ఇస్లామిక్ పాలన అమలుకు కృషి చేస్తామని ఆ సంస్థకు చెందిన కీలక నేత తయ్యిబ్ ముకీమ్ చెప్పినట్టు పేర్కొంది.
తాము నెలకొల్పబోయే ఇస్లామిక్ ఖలీఫా రాజ్యానికి పాక్ వ్యూహాత్మక స్థావరం అవుతుందని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం బ్రిటన్ నుంచి వచ్చిన ముకీమ్.. లాహోర్‌ను కేంద్రంగా చేసుకుని పని చేస్తున్నాడు. పాక్ అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందినప్పటి నుంచి ఈ సంస్థ పాక్‌పైనే తన దృష్టిని కేంద్రీకరించివుంది. కాగా, ఈ సంస్థ కోసం రిక్రూట్ చేసుకున్న సభ్యులకు బ్రిటన్‌లో శిక్షణ ఇస్తున్నట్టు ది సండే టైమ్స్ పేర్కొంది.