పాకిస్థాన్ యుద్ధ విమానాలు దేశ వాయువ్య ప్రాంతంలో అనుమానిత తాలిబాన్ తీవ్రవాద స్థావరంపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆరుగురు తాలిబాన్ తీవ్రవాదులు మృతి చెందారని నిఘా అధికారులు తెలిపారు. శనివారం ఉదయం పాకిస్థాన్ యుద్ధ విమానంలో సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లోని తీవ్రవాద స్థావరంపై దాడి చేశాయని చెప్పారు.
ఈ ప్రావీన్స్‌లోని పలు గిరిజన ప్రాంతాల్లో పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్, అతని ప్రధాన అనుచరులను పట్టుకునేందుకు సైనికులు గత కొన్నివారాలుగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పాక్ మాజీ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య కేసులో ప్రధాని నిందితుడు బైతుల్లా మెహసూద్ అయిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడులకు కూడా ఇతనే సూత్రధారి అని ఆరోపణలు ఉన్నాయి. శనివారం ఎగువ ఒరాక్‌జై ప్రాంతంలో జరిపిన వైమానిక దాడుల్లో మెహసూద్ డిప్యూటీ హాకీం ఉల్లా రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో అతను అక్కడ ఉన్నాడో లేదో తెలియరాలేదు.