పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో గత మూడు రోజులుగా సైనికులు సుమారు 56 మంది తీవ్రవాదులను హతమార్చారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో తాలిబాన్ తీవ్రవాదులతో పాక్ సైనికులు పోరాడుతున్నారు.
తాజా పోరులో ఆరుగురు సైనికులు కూడా మృతి చెందారని పాకిస్థాన్ మిలిటరీ మంగళవారం వెల్లడించింది.
ఈ ప్రాంతంలో జరుగుతున్న పోరుపై స్వతంత్ర నివేదికలు వచ్చే అవకాశం లేదు. పోరు జరుగుతున్న ప్రాంతంలోకి జర్నలిస్టులకు ప్రవేశం లేదు. స్వాత్ లోయకు సరిహద్దుల్లో ఉన్న దిగువ దీర్‌లోని మైదాన్ ప్రాంతంలో సైనిక దళాలు తాజాగా ఆపరేషన్ చేపట్టాయి.
ఆదివారం, సోమవారం జరిగిన తాజా ఆపరేషన్‌లో సైనికులు ఎక్కువ మంది తీవ్రవాదులను హతమార్చామని అధికారిక వర్గాలు తెలిపాయి. స్వాత్ లోయలో తాలిబాన్ తీవ్రవాదులను అణిచివేసేందుకు కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టిన సంగతి తెలిసిందే.