పార్లమెంట్ ఎగువ సభలో ముస్లిమేతరులకు నాలుగు సీట్ల కేటాయింపునకు సంబంధించిన 1975 సెనేట్ నిబంధనల సవరణపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. ప్రతి ప్రావిన్స్ నుంచి ఒక్కరు తరపున మొత్తం నాలుగు సీట్లు ముస్లిమేతరులకు సెనేట్‌లో అందుబాటులో ఉంటాయి. వచ్చే సెనేట్ ఎన్నిక సందర్భంగా ప్రతి ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యులు ముస్లిమేతరులను ఎన్నుకొంటారు.
ముస్లిమేతరులకు సెనేట్‌లో సీట్లు కేటాయించడం ఇదే తొలిసారి. గతంలో జాతీయ అసెంబ్లీలో ముస్లీమేతరులకు పది సీట్లు కేటాయించినప్పటికీ సెనేట్‌లో మాత్రం కేటాయించలేదు. జర్దారీ సంతకం చేసే కార్యక్రమానికి సెనేట్ ఛైర్మన్ ఫరూక్ హెచ్. నాయిక్, సెనేట్ నాయకుడు సయ్యద్ నయ్యర్ హుస్సైన్ బొఖారీ, వివిధ పార్టీలకు చెందిన సెనేటర్లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు.