పాకిస్థాన్ జైళ్లలో మగ్గుతున్న ఇద్దరు మహిళలతో సహా 24 మంది భారతీయులు శనివారం వాఘా సరిహద్దు వద్ద స్వదేశంలోకి అడుగుపెట్టారు. ఇరు దేశాల జాలర్లను సంవత్సరాల పాటు బాధపెట్టకుండా త్వరగా విడుదల చేయాలని ఇండో-పాక్ జుడీషియల్ ప్యానెల్ డిమాండ్ చేసింది.
కరాచీలోని మాలిర్ జైలులో 15 నెలలుగా మగ్గుతున్న 14 మంది జాలర్లను ఇరు దేశాల మధ్య సృహద్భావ సూచికగా విడుదల చేస్తున్నట్లు శుక్రవారం పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా అధికారులు ఈ రోజు ఇద్దరు మహిళలతో సహా మరో పదిమందికి స్వేచ్ఛ కల్పించాలని నిర్ణయించారు.
ఇద్దరు మహిళలతో సహా 24 మంది బందీలను భారత సైన్యానికి అప్పగించినట్లు పాకిస్థాన్ రేంజర్స్ ప్రతినిధి మహబూబ్ హుస్సేన్ తెలిపారు. భారత అధికారులు భారత్‌లోని వివిధ జైళ్లలో వున్న 87 మంది పాకిస్థాన్ జాలర్లను ఈ వారంలో జరిగిన విదేశాంగ మంత్రుల చర్చలకు కొంచెం ముందుగా విడుదల చేశారు.