న్యూజిలాండ్‌లో స్వైన్ ఫ్లూ వ్యాధికి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. హామిల్టన్ నగరంలో 19 సంవత్సరాల యువకుడు ఈ వ్యాధి బారిన పడి తుది శ్వాస విడిచినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే, క్రెస్ట్‌చర్చ్‌లో 42 సంవత్సరాల వ్యక్తి మరణించగా, మరో యువతి కూడా ఈ వ్యాధికి ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. వెల్లింగ్టన్ హాస్పిటల్‌లో శనివారం ఉదయం స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడిన యువతి మృతి చెందిందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై కివీస్ ఆరోగ్య మంత్రి టోనీ రేల్ మాట్లాడుతూ.. స్వైన్ ఫ్లూ వ్యాధి దేశ వ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు.
దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదన్నారు. పబ్లిక్ హెల్త్ డైరక్టర్ మార్క్ జాకబ్ మాట్లాడుతూ.. దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడుతున్న రోగులు చికిత్స నుంచి త్వరగానే కోలుకుంటున్నారని, అయితే, కొన్ని కేసులు మాత్రం చికిత్స ఫలించక మృతి చెందుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 945 కేసులు నమోదైనట్టు చెప్పారు. శుక్రవారానికి ఈ కేసుల సంఖ్య 912గా ఉన్నదని చెప్పారు.