ఉత్తర నైజీరియాలో ఇస్లామిక్ ఆందోళనకారులను అణిచివేసేందుకు భద్రతా దళాలు చేపట్టిన హింసాత్మక చర్యల్లో మృతి చెందినవారి సంఖ్య బుధవారం 300పైకి చేరింది. ఇదిలా ఉంటే ఈ హింసాకాండ కారణంగా వేలాది మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇస్లామిక్ తాలిబాన్ వర్గాన్ని అణిచివేసేందుకు దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఉత్తర నైజీరియాలోని మైదుగురి నగరంలో నైజీరియా తాలిబాన్లతో భద్రతా సిబ్బంది పోరాడుతున్నారు. నైజీరియా తాలిబాన్లు చేపట్టిన "ఒన్స్ అండ్ ఫర్ ఆల్" ఉద్యమాన్ని అణిచివేయాలని దేశ అధ్యక్షుడు ఉమరు యార్‌అదువా ఆదేశాలు జారీ చేయడంతో సైన్యం రంగంలోకి దిగింది.
తాలిబాన్ల నిర్మాణాత్మక ఉద్యమాన్ని అడ్డుకునే చర్యలతో పెద్దఎత్తున హింసాకాండ జరుగుతోంది. ఈ హింసాకాండ యోబే రాష్ట్రానికి కూడా విస్తరించింది. ఇక్కడ పోలీసులతో బుధవారం ఇస్లామిక్ వర్గం ఘర్షణలకు దిగడంతో 43 మంది మృతి చెందారు. మైదుగురిలోని పెద్దఎత్తున పోరు జరుగుతోంది. తీవ్రవాదుల స్థావరాలపై మోర్టార్ షెల్స్ ప్రయోగిస్తున్నట్లు సైనికాధికారులు చెప్పారు.