నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన భక్తులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. నేపాల్‌లోని సన్‌సూరి జిల్లాలో ఈ ఘోరం సంభవించింది. భక్తులతో నిండివున్న ఆలయం ఒకటి కూలిపోగా, ఈ దుర్ఘటనలో 24 మంది భక్తులు మృత్యువాత పడినట్టు స్థానిక పోలీసు వర్గాలు వెల్లడించాయి.
దారణ్ అనే ప్రాంతంలోని ఒక ఆలయంలో మంగళవారం ఓ వర్గానికి చెందిన కొంతమంది ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రార్థనలకు సుమారు 1500 మందికి పైగా హాజరయ్యారు. ఆ సమయంలో ఆలయంలోని ఓ భాగం కూలిపోయిందని పోలీసులు తెలిపారు.
శిథిలాల కింద చిక్కుకున్న భక్తుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, 17 మంది మహిళలు సైతం ఉన్నారు. నీరూరాయ్ అనే 35 సంవత్సరాల భారత సంతతి మహిళ కూడా ఉన్నారు. కాగా, ఈ ప్రమాదంలో మరో 62 మందికి పైగా గాయపడ్డారు.