నేపాల్ మాజీ పాలకుడు జ్ఞానేంద్ర సంపదపై ఆ దేశ ప్రభుత్వం మరోసారి పరిశీలన జరిపే అవకాశం ఉంది. ప్రభుత్వ కమిటీ ఒకటి జ్ఞానేంద్ర వ్యక్తిగత ఆస్తుల నుంచి కొంతమేర నిధులు బ్రిటన్ బ్యాంకుకు బదిలీ అయినట్లు గుర్తించింది. దీంతో ఆయన వ్యక్తిగత ఆస్తులపై నేపాల్ ప్రభుత్వం మరోసారి నిఘా పెట్టింది.
ఈ మాజీ రాజు తన వ్యక్తిగత సంపద నుంచి మార్చి 2003లో కొన్ని నిధులను దివంగత రాజు బీరేంద్ర, ఆయన కుటుంబసభ్యుల పేరుతో ఓ బ్రిటన్ బ్యాంకుకు బదిలీ చేశారని నేపాల్ ట్రస్ట్ ఆఫీస్ (ఎన్టీవో) గుర్తించింది. నేపాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీవో రాజ కుటుంబ ఆస్తులను పర్యవేక్షిస్తుంది.
జ్ఞానేంద్ర పెద్దమొత్తంలో నిధులను బీరేంద్ర, ఆయన కుటుంబసభ్యుల పేర్లతో 2003లో ఖాట్మండులోని ఓ బ్యాంక్ నుంచి బ్రిటన్ బ్యాంకుకు బదిలీ చేశారని ఎన్టీవో గుర్తించినట్లు ఇంగ్లీష్ దినపత్రిక ఒకటి వెల్లడించింది. జున్ 2001లో రాజ కుటుంబంలో జరిగిన దారుణ హత్యల అనంతరం జ్ఞానేంద్ర నేపాల్ పాలనాపగ్గాలు చేపట్టారు.
అనంతరం రాజకుటుంబానికి చెందిన మొత్తం నిధులను ఖాట్మండులోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో టైమ్- డిపాజిట్ అకౌంట్‌లో ఉంచారు. అనంతరం 2003 మార్చి 12న ఇందులో 10 మిలియన్ రూపాయాల (108854 స్టెర్లింగ్ పౌండ్లు) నిధులను బ్రిటన్ బ్యాంకులోని కొత్త అకౌంట్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధుల బదిలీని ప్రస్తుతం ఎన్టీవో పరిశీలిస్తోంది.
ఆగస్టు 23, 2007లో రాజు ఆస్తులను జాతీయం చేయాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో 240 ఏళ్ల రాచరిక పాలనకు ముగింపు పలికిన సందర్భంగా నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 12 రాజ భవనాలు, ఐదు అటవీ సంపదలు, వివిధ కంపెనీలకు చెందిన షేర్లు, వ్యాపార సముదాయాలు, ప్రధానమైన నారాయణహితి ప్యాలస్‌లు ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం జాతీయం చేసింది.