నేపాల్ మాజీ గెరిల్లా పార్టీ యూనిఫైడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్) సోమవారం నేపాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు కొత్త ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్‌కు 72 గంటల గడువు విధించింది. మాధవ్ కుమార్ నేతృత్వంలోని ఇటీవల నేపాల్‌లో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, లేకుండా వీధుల్లోనూ, పార్లమెంట్‌లోనూ తాము తాజా ఆందోళన మొదలుపెడతామని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. మావోయిస్టులు తమ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా, అధికారంలో ఉన్న మాధవ్ కుమార్ నేపాల్ ప్రభుత్వాన్ని గద్దె దిగాలని పట్టుబడుతున్నారు.
ప్రస్తుతం నేపాల్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధమని, ఇది అక్రమ ప్రభుత్వామని మావోయిస్టు నేత, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బాబూరామ్ భట్టారై విమర్శించారు. బాబూరామ్, మరో ఇద్దరు మావోయిస్టు సీనియర్ నేతలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధ్యక్షుడు రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడంతో మిలిటరీ నీడలో ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటయిందని భట్టారై పేర్కొన్నారు.