ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని వరుసగా జరిగిన జాత్యహంకార దాడులపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్‌ను ఆస్ట్రేలియా ప్రభుత్వం బుధవారం తోసిపుచ్చింది.
ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి జూలియా గిల్లార్డ్ ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడుతూ... ప్రస్తుతానికి దాడులపై స్వతంత్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం కనిపించలేదన్నారు. విక్టోరియా పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. విక్టోరియా పోలీసుల చేత దర్యాప్తు జరిపించడం ఉత్తమమని తెలిపారు. దుండగులను గుర్తించేందుకు భారతీయులతో విక్టోరియా పోలీసులు కలిసి పనిచేస్తున్నారని ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఉపప్రధాని కూడా భారతీయులపై జరిగినవి జాత్యహంకార దాడులు కాదని అభిప్రాయపడ్డారు. విక్టోరియా పోలీసులు ఇప్పటికే ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, విద్యార్థులకు ఆస్ట్రేలియా సురక్షితమైన ప్రదేశమని హామీ ఇచ్చారు.