థాయ్‌లాండ్‌లో సోమవారం ఉదయం ఓ రైలు పట్టాలు తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృత్యువాత పడగా పలువురికి తీవ్రగాయాలైనాయి.
థాయ్‌లాండ్‌లోని దక్షిణ త్రాంగ్ ప్రాంతంనుంచి బ్యాంకాక్ వస్తున్న ఓ రైలు హువాహిన్ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో దక్షిణభాగంలో పట్టాలు తప్పాయని హువాహిన్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి కర్నల్ క్రిస్నా జమ్సావేంగ్ తెలిపారు.
రైలు పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతి చెందగా 45మంది తీవ్రగాయాల పాలైనట్లు ఆయన వివరించారు. తీవ్ర గాయాలపాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని ఆయన వెల్లడించారు
థాయ్‌లాండ్‌లో జరిగిన దుర్ఘటన భారతదేశపు సమయానుసారం( ఐఎస్‌టీ ) సోమవారం ఉదయం మూడు గంటల ఇరవై నిమిషాలకు జరిగిందని ఆయన వెల్లడించారు. దుర్ఘటనకు సంబంధించి విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుండగా వందమందికి పైగా గాయాలపాలైనట్లు స్థానిక మీడియా తెలిపింది. రైలుకు సంబంధించిన ఆరు బోగీలు పట్టాలు తప్పిపోవడంతో దక్షిణ థాయ్‌లాండ్‌లో రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు.
కాగా త్వరలోనే తాము పట్టాలను మార్చి రైలు ప్రయాణాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తామని ఆ అధికారి వెల్లడించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటన కారణంగా నాలుగు రైళ్ళలోని ప్రయాణీకులను బ్యాంకాక్ చేరవేస్తున్నట్లు ఆయన తెలిపారు. వీరిలో పట్టాలు తప్పిన రైలు ప్రయాణీకులు కూడా అందులోనున్నట్లు ఆయన వెల్లడించారు.