త్వరలో ఇండో-చైనా ప్రధానమంత్రుల సమావేశం
వచ్చే వారం భారత్, చైనా దేశాల ప్రధానమంత్రుల సమావేశం జరగవచ్చని చైనాకు చెందిన ఓ పత్రిక శుక్రవారం వెల్లడించింది. థాయ్‌లాండ్‌లో అక్టోబర్ నెల 23 నుంచి 25 మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా, భారతదేశానికి చెందిన ప్రధానమంత్రుల భేటీని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరోధించలేదని ఆ పత్రిక పేర్కొంది. చైనా ప్రధాని వెన్ జియాబావో కార్యక్రమాలకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ సంబంధిత విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సచివాలయ ప్రతినిధి వెల్లడించినట్లు ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. మళ్ళీ తెరపైకి వచ్చిన సరిహద్దు సమస్య గురించి వెన్ మరియు సింగ్‌ల భేటి ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఆ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం చైనా అరుణాచలప్రదేశ్‌ను ఓ వివాదాస్పద ప్రాంతంగానే పరిగణిస్తోంది. ఇటీవలే భారతప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచలప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించడంపై నిప్పులు చెరిగింది. దీనికి ప్రతిస్పందిస్తూ... భారత్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన విషయం విదితమే. ఇలాంటి సందర్భంలో ఇరు దేశాల ప్రధానుల బేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.