పాకిస్థాన్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకునేందుకు తాలిబాన్ తీవ్రవాదులతో పోరాడుతుందని ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. తాలిబాన్లను పూర్తిగా అణిచివేసే వరకు పాక్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌లో ముందురోజు వివిధ ప్రదేశాల్లో జరిగిన తీవ్రవాద దాడుల్లో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్దారీ మాట్లాడుతూ.. సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తమ పోరు చివరి వరకు కొనసాగుతుందని చెప్పారు. పాకిస్థాన్ సమస్యాత్మక స్వాత్ లోయ, దాని పరిసర ప్రాంతాల్లో సైన్యం కొన్నివారాల క్రితం తాలిబాన్లపై ఆపరేషన్లు చేపట్టింది.
సైనిక చర్యలను ఉధృతం చేసేందుకు పాకిస్థాన్ సైన్యం రంగం సిద్ధం చేసిందని అమెరికా అధికారిక యంత్రాంగం కూడా ధృవీకరించింది. జర్దారీ తాజాగా టెలివిజన్‌లో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశ సౌర్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు తాలిబాన్లతో యుద్ధం చేస్తున్నామన్నారు. తాలిబాన్లు అమాయక పౌరుల శత్రువులని పేర్కొన్నారు. దేశ వ్యవస్థలను నియంత్రణలోకి తీసుకునేందుకు వారు సాధారణ పౌరులను భయపెట్టాలనుకుంటున్నారని చెప్పారు.