పాకిస్థాన్ సైన్యం వజీరిస్థాన్ ప్రాంతంలోనున్న తాలిబన్ స్థావరాలపై దాడులకు పాల్పడేందుకు చుట్టుముట్టింది. ఇప్పటికే పాక్ ప్రభుత్వం అక్కడ కర్ఫ్యూ విధించింది.
తాలిబన్లను మట్టుబెట్టేందుకుగాను ప్రముఖ రాజకీయ నాయకులు, సైనికాధికారులు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో వారు తీసుకున్న నిర్ణయం కారణంగా సైనికులు వజీరిస్థాన్ ప్రాంతంలోనున్న తాలిబన్ స్థావరాలను చుట్టుముట్టేందుకు ముందుకు కదిలారు.
వీరు చుట్టుముట్టాలనుకున్న ప్రాంతం తాలిబన్ ఉగ్రవాద ప్రముఖుడు హకీముల్లా మెహసూద్ సామ్రాజ్యంగా సైనికులు భావిస్తున్నారు. సైనికుల భద్రత నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా వజీరిస్థాన్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించింది.
ఇదిలావుండగా శనివారం వజీరిస్థాన్ ప్రాంతంలోని రోడ్డుప్రక్కన జరిగిన బాంబు దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు స్థానికి జియో టీవీ ఛానెల్ తెలిపింది.
కాగా దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో సైనికులు తమ ఆపరేషన్ ప్రారంభించారని, కాని అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంతవరకు వెలువడలేదని ఆ ఛానెల్ తెలిపింది.
పాక్ సైన్యం మూడు వైపులనుంచి తాలిబన్ స్థావరాలను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడున్న ప్రజలు సరిహద్దుల్లోనున్న డేరా ఇస్మాయిల్ ఖాన్, ట్యాంక్ లాంటి తదితర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారని ఆ వార్తా సంస్థ వెల్లడించింది.