శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు సాగిన అంతర్యుద్ధానికి ఇటీవల తెరపడింది. వేర్పాటువాద ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థపై శ్రీలంక సైన్యం గత నెలలో సంపూర్ణ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంతర్యుద్ధంలో్ సుమారు లక్ష మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
పౌర మరణాలపై విచారం వ్యక్తం చేసిన శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స.. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన తమిళ పౌరులకు పునరావాసం కల్పించడం ప్రస్తుతం తమ ముందున్న పెద్ద సవాలు అని తెలిపారు. ప్రస్తుతం రాజపక్స మయన్మార్ పర్యటనలో ఉన్నారు.
యుద్ధం జరిగిన ఉత్తర ప్రాంతంలో తిరిగి సాధారణ పౌర జీవనాన్ని పునరుద్ధరించడం, అక్కడి పౌరులకు పునరావాసం కల్పించడం తమ ప్రభుత్వానికి తాజా సవాలు అని రాజపక్స చెప్పినట్లు శ్రీలంక ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఎల్టీటీఈపై జరిగిన యుద్ధంలో లక్ష మంది పౌరులు మృతి చెందారని రాజపక్స మయన్మార్ పర్యటనలో చెప్పారు.