ఇటలీలోని ట్రియస్టే నగరంలో ఈ వారం జరిగే జి8 సమావేశంలో భాగంగా భారత్- పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు కలుసుకోబోతున్నారు. భారత్, పాకిస్థాన్ విదేశాంగ శాఖల మధ్య ఈ సందర్భంగా చర్చలు జరుగుతాయని మంగళవారం మీడియా కథనాలు వెల్లడించాయి.
భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిలు జి8 సమావేశానికి హాజరవుతున్నారు. జూన్ 25, 27 మధ్య జరిగే జి8 సమావేశాల్లో భాగంగా ఇరుదేశాల మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉందని ఆజ్ వార్తా ఛానల్ వెల్లడించింది.
దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు. పాకిస్థాన్ అధికారిక వర్గాలు మాత్రం జి8 సమావేశానికి విదేశాంగ శాఖ కార్యదర్శి సల్మాన్ బషీర్ హాజరుకావడం లేదని తెలిపాయి.
ట్రియస్టేలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు సమావేశమయితే.. ఈ నెలలో భారత్- పాకిస్థాన్ మధ్య రెండోసారి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఇటీవల రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ భేటి అయిన సంగతి తెలిసిందే.