పాప్ కింగ్ మైకేల్ జాక్సన్ పిల్లల సంరక్షణ బాధ్యతలు ఆయన తల్లి కేథరీన్ జాక్సన్‌కు అప్పగించబడ్డాయి. పిల్లల సంరక్షణ బాధ్యతలను తన తల్లికి అప్పగించాలని మైకేల్ జాక్సన్ వీలునామాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పిల్లల సంరక్షణ బాధ్యతల కోసం జాక్సన్ మాజీ భార్య డెబ్బీ రావే కూడా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
జాక్సన్ మొదటి ఇద్దరు బిడ్డలకు డెబ్బీ రావే జన్మనిచ్చారు. అయితే తాజాగా కోర్టు బయట పిల్లల సంరక్షణ బాధ్యతలకు సంబంధించి జాక్సన్ కుటుంబసభ్యులతో డెబ్బీ రావే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం పిల్లల శాశ్విత సంరక్షణ బాధ్యతలు జాక్సన్ తల్లి కేథరీన్ జాక్సన్‌కు అప్పగించేందుకు డెబ్బీ రావే అంగీకరించారు.
జాక్సన్ మొదటి ఇద్దరు పిల్లలు ప్రిన్స్ మైకెల్, పారిస్ శాశ్విత సంరక్షణ బాధ్యతలను కేథరీన్ జాక్సన్ తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే జాక్సన్ మూడో బిడ్డ ఫ్రిన్ మైకేల్ 2 తల్లి ఎవరో ఇప్పటికీ ప్రపంచానికి తెలీదు. బ్లాంకెట్గానూ పిలవబడే ప్రిన్స్ మైకేల్ 2 తల్లి ఎవరనేది మైకేల్ జాక్సన్ ఎన్నడూ వెల్లడించలేదు. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం కేథరీన్ జాక్సన్ (79) "ప్రిన్ మైకేల్ 1 (12)," "పారిస్ మైకేల్ కేథరీన్ (11)", "ప్రిన్స్ మైకేల్ 2, బ్లాంకెట్ (7)"ల సంరక్షణ బాధ్యతలు స్వీకరిస్తారు. బిడ్డల లీగల్ పేరెంటల్ రైట్స్ మాత్రం రావే వద్దే ఉంటాయి.