జపాన్ నూతన ప్రధానమంత్రిగా మాజీ ఆర్థికమంత్రి యోషిహికో నొడా అభ్యర్ధిత్వం మంగళవారం ఖరారైంది. జపాన్‌కు గత ఐదు సంవత్సరాల్లో ఆరో ప్రధాని నొడా. భూకంపం, సునామీ, అణు సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం నూతన ప్రధాని ముందున్న పెను సవాలు.
పదవి నుంచి వైదొలగుతున్న నొవొటో కన్ మంగళవారం తన కార్యాలయంలో కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ఉన్నారు. నొడాకు మార్గం సుగమం చేసేందుకు గానూ కన్ క్యాబినేట్ మంగళవారం ఉదయం రాజీనామా చేసింది. 54 ఏళ్ల నొడా సోమవారం ఏడుగురు ప్రత్యర్ధులను ఓడించి అధికార పార్టీ జపాన్ డెమోక్రటిక్ పార్టీ (డీపీజే) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నొడా త్వరలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. మార్చిలో సంభవించిన ప్రకృతి విపత్తుల అనంతరం ఏర్పడిన పరిస్థితులను ఎదుర్కోవడంలో విఫలయిన నొవొటో కన్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష, అధికార సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.