ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఇటీవల రెండు లగ్జరీ హోటళ్లపై జరిగిన బాంబు దాడుల్లో పాల్గొన్న ఆత్మాహుతి దళ సభ్యుల ఊహాచిత్రాలను అధికారిక యంత్రాంగం విడుదల చేసింది. జకార్తాలోని ప్రధాన వ్యాపార కేంద్రంలో ఉన్న జేడబ్ల్యూ మారియట్, రిట్జ్- కార్ల్‌టన్ లగ్జరీ హోటళ్లలో ఐదు నిమిషాల తేడాతో శుక్రవారం బాంబు పేలుళ్లు సంభవించాయి.
ఈ పేలుళ్లలో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు అనుమానిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను ఇండోనేషియా అధికారిక యంత్రాంగం విడుదల చేసింది. దాడులకు జెమాహ్ ఇస్లామియా అనే తీవ్రవాద సంస్థ కారణమని ఆరోపణలు వస్తున్నాయి.
ఇండోనేషియాలో గతంలోనూ ఈ తీవ్రవాద ముస్లిం గ్రూపు దాడులు చేసింది. రెండు హోటళ్లపై జరిగిన ఆత్మాహుతి దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. బాంబు పేలుళ్లలో మృతి చెందిన ఇద్దరు అనుమానితుల తలభాగాలను ఆధారంగా చేసుకొని ఊహాచిత్రాలు తయారు చేశారు.