ఇండోనేషియా రాజధానిలో శుక్రవారం సంభవించిన పేలుళ్లలో తొమ్మిది మృతి చెందగా, వారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నారు. జకార్తాలోని రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మృతి చెందినవారిలో ఏడుగురు విదేశీయులు ఉన్నారని ఇండోనేషియా పోస్ట్ శనివారం వెల్లడించింది.
జకార్తాలో ఆత్మాహుతి బాంబర్లు శుక్రవారం జేడబ్ల్యూ మారియట్, దీనికి సమీపంలోని రిట్జ్- కార్ల్‌టన్ హోటళ్లపై దాడి చేశారు. ఈ రెండు హోటళ్లలోనూ ఎక్కువగా వ్యాపారవేత్తలు, దౌత్యాధికారులు బస చేస్తుంటారు.
పోలీసులు శుక్రవారం రాత్రి ఈ పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్యను ఎనిమిదికి తగ్గించారు. 60 మందికిపైగా గాయపడ్డారని తెలిపారు. అయితే శనివారం మృతి చెందినవారి సంఖ్య మళ్లీ తొమ్మిదికి చేరినట్లు, మృతుల్లో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ఉన్నారని ఇండోనేషియా అధికారిక యంత్రాంగం పేర్కొంది. మృతుల్లో ఆత్మాహుతి దళ సభ్యులు ఇద్దరు ఉండగా, మిగిలివారందరూ విదేశీయులే.