ఇండోనేషియా రాజధానిలో రెండు లగ్జరీ హోటళ్లలో శుక్రవారం ఉదయం సంభవించిన పేలుళ్ల వెనుక ఉన్న ఆత్మాహుతి దళ సభ్యులను గుర్తించేందుకు అధికారిక యంత్రాంగం కసరత్తులు చేపట్టింది. జకార్తాలోని రెండు అమెరికా లగ్జరీ హోటళ్లలో సంభవించిన బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు.
ఈ పేలుళ్లకు పాల్పడిన ఆత్మాహుతి దళ సభ్యులను గుర్తించేందుకు ఇండోనేషియా అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ పేలుళ్లలో కనీసం నలుగురు విదేశీయులు మృతి చెందారని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయాసియా తీవ్రవాద నెట్‌వర్క్ జెమాహ్ ఇస్లామియా నుంచి వేర్పడిన వర్గానికి నేతృత్వం వహిస్తున్న నూర్డిన్ టాప్ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటాడని ఇండోనేషియా భద్రతా యంత్రాంగం అనుమానిస్తోంది.
ఇది 200 శాతం కచ్చితంగా నూర్డిన్ టాప్ పనే అయివుంటుందని మాజీ జెమాహ్ ఇస్లామియా నేత, ఇప్పుడు పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్న నాసీర్ అబ్బాస్ పేర్కొన్నారు. ఇండోనేషియాలో గత మూడు ఉగ్రవాద దాడుల దర్యాప్తులో అబ్బాస్ పోలీసులకు సాయం అందించారు. పోలీసులు కూడా శుక్రవారంనాటి పేలుళ్లకు నూర్డిన్ టాప్ సూత్రధారి అని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు.