చైనాలో మరణదండన ఎదుర్కొంటున్న ఖైదీలకు ఇకపై శిక్షను విషపూరిత ఇంజెక్షన్లతో అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వారిని కాల్చిచండడం ద్వారా చైనా అధికారిక యంత్రాంగం మరణశిక్షను అమలు చేస్తోంది. ఈ పద్దతికి బదులుగా ఇంజెక్షన్లతో శిక్షను అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చైనా ప్రభుత్వ మీడియా మంగళవారం వెల్లడించింది.
బీజింగ్ మున్సిపల్ హైపీపుల్స్ కోర్టు ఈ ఏడాది చివరి నాటికి కొత్త పద్దతిని అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇంజెక్షన్లతో మరణశిక్షలు అమలు చేయడంపై పోలీసులకు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడాన్ని అప్పటికి పూర్తి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మిగిలిన అన్ని దేశాల కంటే చైనాలో మరణదండనలు ఎక్కువగా అమలు అవుతుంటాయి.
ఈ ఏడాది కూడా ఐదు వేల మందికి మరణశిక్షలు అమలు చేసే అవకాశం ఉంది. చైనా సుప్రీం పీపుల్స్ కోర్టు కాల్చిచంపడం కంటే ఇంజెక్షన్లతో మరణ శిక్ష అమలు చేయడం సురక్షితమైన మార్గంగా భావిస్తోంది. కాల్చిచంపే సమయంలో ఖైదీలకు భయం, బాధ ఎక్కువగా ఉంటాయి. ఈ పద్దతితో పోలిస్తే ఇంజెక్షన్ల ద్వారా ఖైదీలకు శిక్ష అమలు చేసే సమయంలో భయాన్ని, బాధను తగ్గించవచ్చు.