దేశ రహస్యాలను రియో టింటో ఎగ్జిక్యూటివ్‌లు తస్కరించారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చైనా తెలియజేసింది. ఈ విషయాన్ని బుధవారం చైనా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈజిప్టులో గతవారం జరిగిన అలీనోద్యమ దేశాల సదస్సులో భాగంగా చైనా, ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ సహాయమంత్రులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా చైనా విదేశీ వ్యవహారాల సహాయమంత్రి హి యాఫీ ఆస్ట్రేలియా మంత్రి స్టీఫెన్ స్మిత్‌కు తాజా పరిణామాలను వివరించారు. చైనా దేశ రహస్యాలను రియో టింటో ఉద్యోగులు తస్కరించారనేందుకు తమ వద్ద అవసరమైన ఆధారాలు ఉన్నాయని హి యాఫీ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ కేసు న్యాయవ్యవస్థ చేతుల్లోకి వెళ్లిందన్నారు. చైనా న్యాయవ్యవస్థను ఆస్ట్రేలియా ప్రభుత్వం గౌరవించాలని యాఫీ విజ్ఞప్తి చేశారు.
రియో టింటో ఆస్ట్రేలియా అధిపతి స్టెర్న్ హు, మరో ముగ్గురు స్థానిక సిబ్బందిని ఈ నెల ప్రారంభంలో చైనా అధికారిక యంత్రాంగం అరెస్టు చేసింది. దేశ రహస్యాలను సేకరించేందుకు వారు లంచం, ఇతర అక్రమ కార్యక్రలాపాలకు పాల్పడినట్లు చైనా యంత్రాంగం అనుమానిస్తోంది.
ఇనుప ఖనిజం కాంట్రాక్టు చర్చల సందర్భంగా స్టీలు మిల్లు అధికారులకు తమ ఉద్యోగులు లంచం ఇవ్వజూపినట్లు వచ్చిన వార్తలను రియో టింటో కంపెనీ తోసిపుచ్చింది. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొంది. ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడ్ కూడా దీనిపై చైనాకు హెచ్చరికలు పంపారు.
రియో టింటో కంపెనీపై కేసుకు గణనీయమైన వ్యాపార ప్రయోజనాలను రూడ్ ముడిపెట్టారు. విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ కంపెనీలు తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలిపారు.