"కింగ్ ఆఫ్ పాప్" మైఖేల్ జాక్సన్ గతించిన తర్వాత అతని భవిష్య ప్రణాళికలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చివరిరోజుల్లో మైఖేల్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలకు అతుక్కుపోయారట. అంతేకాదు ఇటీవల "జయహో.."తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి పనిచేయాలని అనుకున్నారట. రెహ్మాన్ స్వరపరిచిన ఓ జాతీయ గీతాన్ని తను రూపొందించబోయే ఆల్బమ్‌లో పొందుపరచాలని నిర్ణయించుకున్నారట.
"జయహో..."కు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత రెహ్మాన్ మైఖేల్ జాక్సన్‌ను కలిశాడట. ఆ సందర్భంలో జాక్సన్... తను త్వరలో రూపొందించబోయే ఆల్బమ్‌లో ఓ జాతీయగీతాన్ని సమకూర్చాలని రెహ్మాన్‌ను కోరాడట.
"స్లమ్ డాగ్ మిలియనీర్" సంచలన విజయానంతరం మైఖేల్ కూడా భారతదేశం నేపథ్యంగా తీసుకుని ఓ మహత్తరమైన గీతాన్ని ఆవిష్కరించాలని కలలు కన్నాడట. అందుకు అనుగుణంగా అవసరమైన సరంజామాను సైతం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇందులో భాగంగా తన అనుచరులను రెహ్మాన్‌తో మాట్లాడమని పురమాయించినట్లు సమాచారం. అంతేకాదు జీవిత దర్పణాల్లాంటి రవీంద్రుని రచనల్లోని జీవిత సత్యాలను తన ఆల్బమ్‌లో చొప్పించాలని కసరత్తు ప్రారంభించాడట. రవీంద్రుని రచనలతోపాటు రహస్యంగా హిందూత్వాన్ని తెలిపే గ్రంథాలను కూడా చదివినట్లు భోగట్టా.
అంతర్జాతీయ సమాజానికి ఆధ్యాత్మిక భారతం యొక్క విశిష్టతను తెలిపే కోరిక తీరకుండానే జాక్సన్ పరమపదించడం విషాదం.