భారత జాతిపిత మహాత్మగాంధీ దక్షిణాఫ్రికాలో మూడేళ్లపాటు నివాసం ఉన్న ఇంటిని విక్రయించాలని సదరు యజమాని నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలో వజ్రాలు, బంగారం పరిశ్రమలతో ప్రసిద్ధి చెందిన జొహనెస్‌బర్గ్‌లో మహాత్మా గాంధీ ముడేళ్లపాటు నివసించారు. ఆయన ఉన్న ఇంటిని దాని యజమాని అమ్మకానికి పెట్టారు.
ఇప్పటివరకు ఆ ఇంటిని ఎవరూ కొనుగోలు చేయనప్పటికీ, ఆ దేశంలో భారత సంతతి వ్యక్తులు కొందరు దీనిపై కొంత ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ జొహనెస్‌బర్గ్‌కు ఉత్తరంగా ఉన్న ఓర్చార్డ్స్ ప్రాంతంలోని ఓ నిశ్శబ్దమైన వీధిలో ఈ ఇల్లు ఉంది. ఇంటిని అనధికారికంగా క్రాల్‌గా పిలుస్తారు. గాంధీ 1908 నుంచి మూడేళ్లపాటు ఈ ఇంటిలో కాలెన్‌బాచ్‌తో కలిసివున్నారు.
యజమాని నాన్సీ బాల్ గత 25 ఏళ్లుగా ఈ ఇంటిలోనే ఉంటున్నారు. ఆమె ఇప్పుడు కేప్‌టౌన్ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో, ఆ ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఆమె ఈ ఇంటి విక్రయ ధరను మాత్రం వెల్లడించలేదు. ఇంటిని విక్రయించేందుకు సరైన కొనుగోలుదారును వెతకడంలో విట్‌వాటర్‌స్రాండ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ ఇన్ ఆఫ్రికా సంస్థ వ్యవస్థాపకుడు స్టీఫెన్ గెల్బ్ యజమానికి సహకరిస్తున్నట్లు టైమ్స్ పత్రిక వెల్లడించింది.