శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమం నడిపిన ఎల్టీటీఈని దేశంలో పూర్తిగా అణిచివేసినప్పటికీ, శ్రీలంక ప్రభుత్వం దాని అంతర్జాతీయ నెట్‌వర్క్ విషయంలో ఆందోళన చెందుతోంది. దీనికి కారణం ఎల్టీటీఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ ఇప్పటికీ క్రియాశీలకంగా ఉండటమే. ఎల్టీటీఈ అంతర్జాతీయ నెట్‌వర్క్ యూరప్‌లో పనిచేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది.
దీనితో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తాజాగా శ్రీలంక ప్రభుత్వం యూరోపియన్ యూనియన్‌ను కోరింది. ఎల్టీటీఈ మిలిటరీ సామర్థ్యం పూర్తిగా నాశనమైనప్పటికీ, దాని అంతర్జాతీయ నెట్‌వర్క్ ముఖ్యంగా యూరప్‌లో క్రియాశీలకంగా ఉందని బెల్జియంలో శ్రీలంక దౌత్యాధికారి రవినాథ ఆర్యసిన్హా తెలిపారు.
యూరోపియన్ యూనియన్ దీనికి సంబంధించినవారిపై సత్వర చర్యలు తీసుకోకుంటే, ఎల్టీటీఈ తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని యూరోపియన్ పార్లమెంట్ సభ్యులకు ఆర్యసిన్హా తెలియజేశారు. శ్రీలంక మూలాలు కలిగిన తమిళ పౌరులు తమ దేశ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధంగా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు.