కువైట్‌లో దాడికి అల్‌ఖైదా కుట్ర...!
, గురువారం, 13 ఆగస్టు 2009 (09:55 IST)
కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై అల్‌ఖైదా తీవ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారని, వారు పన్నిన పన్నాగాన్ని తాము భగ్నం చేసినటు కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఆరుగురు తమ దేశ పౌరులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన ఆరుగురు కువైట్ పౌరులు అమెరికా స్థావరంతోపాటు, ప్రభుత్వ భద్రతా కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాలపై దాడులకు కూడా కుట్రపన్నినట్లు పేర్కొంది. కువైట్‌లో సుమారు 15 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. పొరుగు దేశమైన ఇరాక్‌లో భద్రతా విధులు నిర్వహించేందుకు అమెరికా సైనికులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కువైట్‌లోని ఆరిఫ్జాన్లోనున్న అమెరికా సైనిక స్థావరంపై దాడికి కుట్ర పన్నామని అరెస్ట్ అయిన తీవ్రవాదులు అంగీకరించినట్లు అదికారులు తెలిపారు.