భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా నెలకొన్న కాశ్మీర్ వివాదం పరిష్కారంలో పురోగతి లేదని పాక్ విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి మసూద్ ఖలీద్ అన్నారు. ఈ వివాదం పరిష్కారంలో తాము అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదని ఆయన శనివారం మీడియాతో అన్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్లో శ్రీలంక జర్నలిస్టుల బృందంతో ఆయన శనివారం మాట్లాడారు. ఇరు దేశాలు పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపట్టామన్నారు. అయినప్పటికీ... దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కాశ్మీర్ వివాద పరిష్కారం విషయంలో మాత్రం కోరుకున్న పురోగతి లభించడం లేదని ఖలీద్ అన్నారు.
ఈ అంశంపై అర్థవంతమైన చర్చకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఖలీద్ను ఉటంకిస్తూ 'ఐలాండ్' వార్తా పత్రిక పేర్కొంది. శ్రీలంకలో ఎల్టీటీఈ తీవ్రవాదుల ముప్పు తొలగిపోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే, దక్షిణాసియాలో శాంతి సుస్థిరతకు తాము కృషి చేస్తున్నట్టు ఖలీద్ అన్నారు.