పాప్ సంగీత ప్రపంచంలో ధృవతారగా ఓ వెలుగు వెలిగిన మైఖేల్ జాక్సన్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన వేలాది మంది అభిమానులు అంతిమ యాత్రలో పాల్గొని ఘనంగా వీడ్కోలు పలికారు.
ఒక దేశాధినేతకు జరిగే తీరులో మైఖేల్ జాక్సన్ అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృత దేహానికి స్టేపుల్స్ సెంటర్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఫారెస్ట్ లాన్ సిమెట్రిలో అంత్యక్రియలు నిర్వహించి పార్థివ శరీరాన్ని ఖననం చేశారు.
ఎర్రటి పూలతో అలంకరించిన 25వేల డాలర్లు విలువ చేసే బంగారు శవపేటికలో ఆయన మృత దేహాన్ని ఉంచారు. పలు దేశాల్లోని వివిధ టీవీ ఛానెళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఆయన అంత్యక్రియలను ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా తిలకించి ఉంటారని అంచనా.
ఇదిలావుండగా మైఖేల్ అంత్యక్రియలను తిలకించేందుకు నిర్వాహకులు అమ్మిన టికెట్ల కోసం దాదాపు 16 లక్షల మంది ఆన్‌లైన్‌లో పోటీ పడగా వీరిలో కేవలం 8,750 మందికి మాత్రమే అనుమతి లభించింది. జాక్సన్ అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని అమెరికా దేశం ప్రపంచవ్యాప్తంగా లాస్‌ఏంజెల్స్ నుండి ప్రత్యక్షప్రసారాలకు అనుమతినిచ్చింది. కాగా లాస్ ఏంజిల్స్ నుంచి వాషింగ్టన్ వరకు దాదాపు 50 సినిమా థియేటర్లు జాక్సన్ అంతిమ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.