బ్రెజిల్ మిలటరీ పైలెట్లు మంగళవారం అట్లాంటిక్ మహాసముద్రంలో కనుగొన్న శకలాలు ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి చెందినవేనని ఆ దేశ ప్రభుత్వం ధృవీకరించింది. అట్లాంటిక్‌లో ఐదు కిలోమీటర్ల మేర విమాన శకలాలు విస్తరించి ఉన్నయాని బ్రెజిల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానం ప్రమాదవశాత్తూ అట్లాంటిక్‌లో కూలిపోయిన సంగతి తెలిసిందే.
ఈ విమానంలో 216 మంది ప్రయాణికులు, మరో 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. బ్రెజిల్ రక్షణ శాఖ మంత్రి నెల్సన్ జోబీమ్ మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. తాజాగా కనుగొన్న శకలాలు ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి చెందినవేనని స్పష్టం చేశారు.
సముద్రంలో తేలుతున్న సీటు, కేబుళ్లు, విమాన పరికారాలు, జెట్ ఇంధనం ఆనవాళ్లు నిస్సందేహంగా ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి చెందినవేనన్నారు. విమానం ప్రయాణించిన మార్గంలోనే బ్రెజిల్ మిలటరీ పైలెట్లు ఈ శకలాలను కనుగొన్నారు. గత ఎనిమిదేళ్లలో సంభవించిన ఘోర విమాన ప్రమాదం ఇదే కావడం గమనార్హం. 2001లో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయిన దుర్ఘటనలో 260 మంది మృతి చెందారు.