ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం శకలాలను బ్రెజిల్ మిలటరీ పైలెట్లు మంగళవారం గుర్తించినట్లు తెలుస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో విమానానికి సంబంధించిన సీటు, లైఫ్ జాకెట్, లోహ శకలాలు, ఇంధనం ఆనవాళ్లు గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే విమానం గాలింపు చర్యల్లో మరో మూడు వాణిజ్య నౌకలు కూడా పాల్గొనబోతున్నాయని బ్రెజిల్ నేవీ తెలిపింది. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళుతున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానం సోమవారం ప్రమాదవశాత్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 228 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.
వీరిలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి గురైన సమయంలో విమానంలో 216 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. మంగళవారం సముద్రంపై తేలియాడుతున్న విమాన శకలాలను రెండు ప్రదేశాల్లో గుర్తించినట్లు బ్రెజిల్ వైమానిక దళం తెలిపింది. ప్రయాణికుల ఆచూకీ ఏమీ తెలియలేదని వెల్లడించింది.
బ్రెజిల్‌కు చెందిన ఫెర్నోండో డి నోరోన్హా ద్వీపానికి 650 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలు గుర్తించారు. విమానం ప్రయాణించిన మార్గంలోనే ఈ శకలాలు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కనబడిన శకలాలు ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి చెందినవేనని ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉంది. వాటిని సేకరించే వరకు తాము ఈ విషయాన్ని ధృవీకరించలేమని అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి సహాయక నౌకలు బుధవారానికి చేరుకునే అవకాశం ఉంది.