గత నెలలో వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలపై జరిగిన భారీ నిరసన ప్రదర్శనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న వందలాది మంది ఆందోళనకారులను విడిచిపెట్టాలని ఇరాన్‌లో శక్తివంతమైన మతపెద్ద అక్బర్ హషేమీ రఫ్సంజానీ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. గత నెలలో అరెస్టు చేసిన ఎన్నికల బందీలను విడిచిపెట్టాలన్నారు.
వివాదాస్పద అధ్యక్ష ఎన్నికలు ఇరానీయన్లు విశ్వాసాన్ని వమ్ము చేశాయన్నారు. దీనికి మనమేం చేయాలని ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ ప్రశ్నించారు. రెండు ప్రధాన సంస్థలతో సంప్రదింపులు జరిపిన తాను ఓ పరిష్కారాన్ని రూపొందించానని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడమే మనముందున్న ప్రధాన కార్తవ్యమని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల బందీలను జైళ్లలో ఉంచాల్సిన అవసరం లేదు. వారిని విడిచిపెట్టాలి. ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇవ్వరాదు. ఇరువర్గాలు ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు. గత నెల 12న జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అక్రమ మార్గాల్లో గెలిచారని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థులు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కొన్నివారాలపాటు జరిగిన ఆందోళనల్లో అధికారిక యంత్రాంగం వందలాది మంది పౌరులను నిర్బంధించింది.