భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే చర్చలే మార్గమని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇటీవల రష్యా పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ జర్దారీ, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మధ్య నిర్మాణాత్మక సమావేశం జరిగిందని అమెరికా అధ్యక్ష భవనం పేర్కొంది.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడానికి చర్చలు ఎంతో ముఖ్యమని వైట్‌హోస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి మైక్ హామెర్ పేర్కొన్నారు. దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిరతకు భారత్- పాక్ చర్చలు కీలకమన్నారు. రష్యాలో ఇరుదేశాల అగ్రనేతల మధ్య సమావేశం జరగడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వారు ఈ చర్చలను కొనసాగించాలని ఆకాంక్షించారు.
రష్యాలో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా జర్దారీ, మన్మోహన్ సింగ్ మధ్య సమావేశమయ్యారు. గత ఏడాది నవంబరులో ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ముంబయి దాడుల తరువాత ఇరుదేశాల అగ్రనేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి.