ఉత్తర కొరియా నుంచి ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని పొందినందుకు బదులుగా పాకిస్థాన్ తన వద్ద ఉన్న యురేనియం శుద్ధి సెంట్రిప్యూజ్‌ల డిజైన్లను ఆ దేశానికి అందజేసిందని అమెరికా కాంగ్రెస్ నివేదిక వెల్లడించింది. 1997లో పరాజయం పాలైన కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి హవాంగ్ జాంగ్ యోప్ ఉత్తర కొరియా, పాకిస్థాన్ మధ్య దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారని నివేదిక పేర్కొంది.
హెచ్ఈయూ (బాగా శుద్ధి చేసిన యురేనియం), ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు పాకిస్థాన్, ఉత్తర కొరియా మధ్య 1996లో ఒప్పందం కుదిరినట్లు హవాంగ్ చెప్పినట్లు తాజాగా ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికా కాంగ్రెస్ సిద్ధం చేసిన నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉత్తర కొరియా మధ్యప్రాచ్య, దక్షిణాసియా ప్రాంతాల్లోని దేశాలకు క్షిపణులు ఎగుమతి చేస్తుందని తెలిపింది.
ఇరాన్, పాకిస్థాన్‌లతో ఉత్తర కొరియాకు సంయుక్త క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు సాగించిందని కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. 1990లలో ఉత్తర కొరియా స్కడ్, నోడోంగ్ క్షిపణులను పాకిస్థాన్, ఇరాన్, యెమెన్, సిరియాలకు ఎగుమతి చేసింది. అదే కాలంలో ఈ క్షిపణులను ఈజిప్టుకు కూడా ఎగుమతి చేసినట్లు తెలుస్తోందని అమెరికా తెలిపింది.